ఖానాపూర్, వెలుగు: కవ్వాల టైగర్ జోన్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేధిస్తూ విధించిన ఆంక్షలను అటవీశాఖ శుక్రవారం ఎత్తివేసిందని, ఇకపై చెక్ పోస్టుల వద్ద అటవీ శాఖ వేధింపులు ఉండవని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ప్రజలె వరూ ఆందోళన చెందవద్దని కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్ రాకేశ్ డోబ్రియాల్‌ను హైదరాబాద్‌లోని అటవీశాఖ కార్యాలయంలో కలిసి అటవీ శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
రాత్రి వేళల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి వేధింపులు ఉండవని, స్థానికులు తమ ఆధారాలు చూపి రాకపోకలు సాగించవచ్చని, వారిని అడ్డుకోకుండా అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పీసీసీఎఫ్ హామీ ఇచ్చారు. బొజ్జు పటేల్ వెంట ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉన్నారు.